ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ

High Court issued notices to MLA Danam Nagender

హైదరాబాద్‌ః ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విజయారెడ్డి తరఫున సుంకర నరేశ్ వాదనలు వినిపించారు.

ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని సుంకర నరేశ్ వాదనలు వినిపించారు. అలాగే దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు. వీటిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.