ఏపీ వరద బాధితులకు టాలీవుడ్ సాయం..ఎవరెవరు ఎంత ప్రకటించారంటే

ఏపీలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు , వరదలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు. ఇక.. పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా.. భారీగా పంటలు, పాడి పరిశ్రమ దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా వందల ఎకరాల పంటనష్టంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆస్తుల నష్టం కలిగింది. దీంతో వరద బాధితులకు ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. గతంలో కూడా ఎన్నోసార్లు పలు విపత్తులకు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈసారి కూడా అలాగే వారి వంతు ఆర్ధిక సాయం అందించారు.

ఎవరెవరు ఎంత సాయం ప్రకటించారో చూస్తే..

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ వరద విపత్తు బాధితుల సహాయానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న సాయంగా నేను 25 లక్షల రూపాయలను అందిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. బాధితులు వరద ముప్పు నుంచి త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించాడు. ఆ తర్వాత మహేశ్‌ బాబు, చిరంజీవి, రామ్‌చరణ్‌ ఒక్కొక్కరు రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్‌ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.