మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు , మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ లోని ఉత్తర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రాత్రి టైంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు అన్నారు. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. తెల్లవారు జాము నుంచి ముసురు వాన పడుతోంది. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మలక్ పేట్, ఎల్బీనగర్, కోఠి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సిటీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలెర్ట్ అయింది. గ్రేటర్ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. రోడ్లపై నీళ్లు ఆగిన చోట వెంటనే క్లియర్ చేయటంతోపాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలా పరిసరాలకు జనం వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ లో నెల రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.