శ్రీరాంసాగర్‌కు భారీ వరద.. 32 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

Heavy flood in Sriramsagar.. 32 gates are lifted and 3 lakh cusecs of water was released.

నిజామాబాద్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్‌ ఉత్పత్తికోసం ఎస్కేప్‌ గేట్‌ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చు. అయితే ఇప్పుడు 78.661 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1404.58 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 17.195 టీఎంసీలు. ఇప్పుడు ప్రాజెక్టులో 17.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా, నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో జిల్లాలోని బీర్కూర్‌లో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఐదు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది.