నేడు ఫైజల్‌ అహ్మద్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

hearing-in-the-supreme-court-on-faisal-disqualified-petition

న్యూఢిల్లీ: అనర్హతకు గురైన లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ లీడర్ మహమ్మద్ ఫైజల్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. తనకు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించిందని, అయినప్పటికీ లోక్ సభ సెక్రటేరియెట్ తనపై అనర్హత వేటు ఎత్తివేయలేదని ఫైజల్ పిటిషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ లాయర్ ఏఎం సింఘ్వి సోమవారం వాదిస్తూ.. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన బెంచ్ ను కోరారు.

దానికి బెంచ్ అంగీకరిస్తూ మంగళవారం విచారణ చేపడతామని తెలిపింది. కాగా, హత్యాయత్నం కేసులో జనవరి 11న ఫైజల్ ను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. పదేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ 13న లోక్ సభ సెక్రటేరియెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది.