‘హ్యారీ పోటర్’ నటుడు కన్నుమూత

‘హ్యారీ పోటర్’ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..శుక్రవారం స్కాట్లాండ్‌లోని ఆసుపత్రిలో మరణించారు. హ్యారీ పోటర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మరీ ముఖ్యంగా హ్యారీ పోటర్ సినిమాను చిన్న పిల్లలు ఇష్టపడుతుంటారు. మంత్రదండంతో హీరో చేసే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. అలా హ్యారీ పోటర్ కథకు, దాన్ని రాసిన జేకే రౌలింగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక హ్యారీ పోటర్ సినిమాలోని కొన్ని పాత్రలు అందరిపైనా ముద్ర వేస్తాయి. అందులో హ్యాగ్రిడ్ పాత్ర ఒకటి. ఆ కారెక్టర్‌ను పోషించిన రాబీ కోల్ట్రేన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఈయన మృతిపై పలువురు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన రాబీ కోల్ల్రేన్‌ ఫ్లాష్‌ గార్డాన్‌ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. హ్యారీ పోటర్‌ సిరీస్‌కు ముందు రాబీ కోల్ట్రేన్.. 1990లో వచ్చిన టీవీ సిరీస్ క్రాకర్‌లో హార్డ్-బీటెన్‌ డిటెక్టీవ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీటితో పాటుగా జేబ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాల్లో నటించాడు. రాబీ వరుసగా మూడు సార్లు ఉత్తమ నటుడిగా BAFTA TV అవార్డులు గెలుచుకున్నాడు.