బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలు – మంత్రి హరీష్ రావు

బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలని అన్నారు మంత్రి హరీష్ రావు. సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..మండలం సగం మీటింగ్‌లో ఉన్న మంది కూడా నిన్న అమిత్ షా మీటింగ్‌లో లేరని సెటైర్లు వేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదని, కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలని అన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు.

యాసంగి పంట 2014లో 14 లక్షల ఎకరాలు పండితే.. నేడు 56 లక్షల ఎకరాల్లో పంట పండింది. 2014లో 3600 కోట్లు పంట కొనుగోళ్లు చేస్తే.. గతేడాది 26,600 కోట్లు కొనుగోలు చేశాం. దేశంలో మొత్తం ఎంత పంట పండుతున్నదో.. ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే పండుతున్నది. కరువు అనే పదాన్ని సీఎం కేసీఆర్ డిక్షనరీ నుంచి తొలగించారు. అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దు. మొన్న పంట నష్ట పోతే ఎకరాకు రూ.10 వేలు ప్రకటించారు. ఇప్పుడు కూడా అకాల వర్షాల వల్ల నష్ట పోయారు. కేసీఆర్ ఉన్నడు. రైతులు అధైర్య పడొద్దు. పంట నష్టం అంచనా వేయాలని సీఎస్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.