ఏపీలో ఒంటి పూట బళ్లు మరికొన్ని రోజులు పొడిగింపు

Half-day schools in AP till June 17 due to heatwave

అమరావతిః ఏపిలో జూన్ 12 నుంచి పాఠశాల తరగతి గది తలుపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సడలింపులు చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా ఒక్క పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. మార్నింగ్ 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వడ గాలులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. స్కూల్స్ రీ ఓపెనింగ్ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, పేరెంట్స్ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపింది.

కాగా, రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. ఎండలు మాత్రం తగ్గలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే వడగాలులు కూడా వీస్తున్నాయి. వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ రిపోర్ట్. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు రాష్ట్ర పేరెంట్స్ సంఘం లేఖ రాసింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ఇవ్వాలని కోరింది. వడగాలుల దృష్ట్యా.. సెలవులపై రివ్యూ చేయాలని సూచించింది. ప్రభుత్వం మాత్రం ఒంటిపూట బడుల్ని ఈ నెల 17 వరకు కొనసాగించి.. ఆ తర్వాత ఎండలు, వేడిగాలులు కొనసాగితే.. ఒంటిపూట బడులు వర్షాలు పడేవరకు కొనసాగించాలని భావిస్తోంది.

ఇక గవర్నమెంట్ స్కూల్స్‌లో స్టూడెంట్స్‌కు ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగి జావ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 11.30 -12 గంటల మధ్య పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి.. ఇంటకి పంపించాలని సూచించింది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.