అక్బర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది

వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోంది: చంద్రబాబు

అమరావతి : ఏపీలో వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని ఆయన అన్నారు. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని విమర్శించారు.

ఇక్కడ కూడా తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు… అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని చంద్రబాబు తెలిపారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? అని ప్రశ్నించారు.

గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని… ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే దిక్కంటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ అక్బర్ కు సూచించారు. మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/