కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే హజ్‌ యాత్ర!

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

Hajj
Hajj

New Delhi: కరోనా విజృంభణ వేళ హజ్‌ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. 

2021లో సౌదీ అరేబియాలోని హజ్‌కు వెళ్లే యాత్రికులు కోవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సిందేనని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పష్టంచేశారు. 

యాత్ర బయల్దేరే వాళ్లంతా ఈ రిపోర్టులను సమర్పించాలని స్పష్టం చేశారు.

హజ్‌ కమిటీ, సంబంధిత సంస్థలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
హజ్‌కు వెళ్లాలనుకునే వారు డిసెంబర్‌ 10లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో, హజ్‌ మొబైల్‌ యాప్‌లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 
RT-PCR పరీక్ష చేయించి విమానం ఎక్కడానికి 72గంటల ముందు తేదీతో ఉన్న రిపోర్టును సమర్పించాలని స్పష్టంచేశారు. 

కరోనా వైరస్‌ కలకలం రేపుతున్న నేపథ్యంలోనే దీన్ని తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతంలో దేశంలోని 21 చోట్ల నుంచి హజ్‌ యాత్ర ప్రారంభం కాగా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దీన్ని 10 ప్రాంతాలకు కుదించినట్టు చెప్పారు. 

ఎయిరిండియా, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/