బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నామ్ సింగ్

నేడు ఢిల్లీ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారో లేదో..అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు దాని బాధ్యతలను హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ కు అందజేశారు. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియామించారు. జాతీయాధ్యక్షుడి హోదాలో తొలి నియామక పత్రాలను వీరికి అందచేయడం విశేషం.
ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని రోడ్ నెంబర్ 5లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, కేసీఆర్ ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.