మరికాసేపట్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌..

మరికాసేపట్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మొదలుకాబోతుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 994 సెంటర్లలో 3,80,081 మంది పరీక్ష రాయనున్నారు. నిరుడు అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన కమిషన్‌.. తిరిగి ఆదివారం నిర్వహిస్తుంది. ఈ సారి పక్కా గా ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లను జిల్లా అథారిటీ ఆఫీసర్లుగా, అడిషనల్‌ కలెక్టర్లను చీఫ్‌ కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు 994 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 994 మంది లైజన్‌ ఆఫీసర్లు, 310 రూట్‌ ఆఫీసర్లను నియమించింది. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్ జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.