సీఎం కేసీఆర్ ఫై గవర్నర్ తమిళ సై ఆగ్రహం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై గవర్నర్ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధువారం ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ పై గవర్నర్ తమిళి సై స్పందించారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నందుకు మిగతా రాష్ట్రాల సీఎంల వాఖ్యలపై స్పందించబోనని.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గవర్నర్‌ను అవమానించారన్నారు. గవర్నర్లపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న గవర్నర్ తమిళిసై.. తనకు ప్రొటోకాల్ తెలుసన్నారు. తాను ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయలేదని స్పష్టం చేశారు. గవర్నర్ అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించిన తమిళిసై.. ఇది అహంకారం కాక ఇంకేంటన్నారు. ప్రొటోకాల్‌పై సీఎం కేసీఆర్ స్పందించాకే ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెప్తానని తమిళిసై పేర్కొన్నారు.

రిపబ్లిక్ డే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని గవర్నర్ తమిళి సై చెప్పారు. బడ్జెట్ సమావేశాలు కూడా త్వరలో జరగనున్నాయని, ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పలు రాష్ట్రాల్లో.. గవర్నర్లతో విపక్ష ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సహా కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.