ఈనెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

17న అఖిలపక్ష సమావేశం

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీః ఈనెల 18 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. సంబంధిత మంత్రి ప్రహ్లాద్‌ జోషి… సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు, ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు చెప్పి, వారి సహకారం కోరనున్నారు. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఎగువసభా పక్ష నేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ, సభ్యుల సహకారంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమై, సభ సజావుగా జరిగేందుకు వారి మద్దతు కోరనున్నారు. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఆయనకు ఇవే చివరి రాజ్యసభ సమావేశాలు కానున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం ఈనెల 5న ప్రారంభమైన నామినేషన్‌ ప్రక్రియ 19వ తేదీతో ముగుస్తుంది. అధికార, విపక్షాలు మాత్రం ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, భాజపా పార్లమెంటరీ బోర్డు ఈనెల 16న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని వెల్లడిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం- అధికార కూటమి అభ్యర్థి 18-19 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్‌ దాఖలుచేసే అవకాశముంది. ఆగస్టు 6న ఎన్నిక జరుగుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/