భద్రాచలం వద్ద 42 అడుగులకు చేరిన గోదావరి

భద్రాచలం వద్ద 42 అడుగులకు చేరిన గోదావరి..ఆదివారం రాత్రికల్లా 43 అడుగులకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. గత నాల్గు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈరోజు రాత్రికల్లా 43 అడుగులకు గోదావరి చేరుకుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. గోదావరి ప్రవాహం పెరుగుతుంటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ హెచ్చరించారు. ముంపునకు గురయ్యే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పశువులను మేతకు విడిచిపెట్టకుండా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్‌ చేయాలని, వాగులు, వంకలు, పంట కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు.

కలెక్టర్‌ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశామని, ఫోన్‌ నంబర్ 08744-241950, వాట్సప్ నంబర్ 93929 29743, ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్‌ వాట్సప్ నంబర్ 93929 19750, భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ 08743 232444, భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వాట్సప్ నంబర్ 63024 85393లో సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకే ఓపెన్‌ కాస్ట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. గనిలో రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో ఓపెన్‌ కాస్ట్‌లో షిఫ్ట్‌ను నిలిపివేశారు అధికారులు. ఒక షిఫ్ట్‌కు 3 వేల టన్నుల చొప్పున ఐదు షిఫ్ట్‌లలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

సత్తుపల్లి ఓపెన్ కాస్ట్‌లోను 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇతర ప్రాంతాల్లోని సింగరేణి అండర్‌ గ్రౌండ్ మైన్‌లలోకి కార్మికులు వెళ్లడం కష్టంగా మారడంతో, బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని అధికారులు అన్నారు. పెనుబల్లి మండలంలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వి.ఎం బంజర్‌లో రహదారులపై వర్షపు నీరు పోటెత్తింది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లంకసాగర్‌ ప్రాజెక్టు, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తింది.