వైస్సార్సీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జగన్ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేసారు. అధికారం చేతిలో ఉందని వైస్సార్సీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని పవన్​ కల్యాణ్​ హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు.. జాగ్రత్త అని సూచించారు.

ఈరోజు ఆదివారం విజయవాడలో రెండోవిడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ప్రారంభించారు. ఎంబీకే భవన్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని పవన్​ భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నామని.. సీఎం సంక్షేమనిధి, ఆరోగ్యశ్రీలో అమలుకాని అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.

ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం పవన్కళ్యాణ్ నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.