గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కు కీలక పదవి అప్పగించిన తెలంగాణ సర్కార్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున పోటీ చేసి..బిజెపి నేత ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కు కేసీఆర్ కీలక పదవి అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ నిర్ణయం మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు

ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్‌వీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. 2017 నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఉస్మానియాలోనూ, బయటా విద్యార్థి పోరాటాలకు గెల్లు శ్రీనివాస్ కొత్త అర్థాన్నిచ్చారు. సమైక్యవాదుల పై నిరసనజెండాను ఎగురవేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చరుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో ఆయనపై వందకు పైగా పోలీసు కేసులున్నాయి. అనేక పర్యాయాలు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ కోసం రెండుసార్లు జైలుకు వెళ్లి.. 36రోజులు చర్లపల్లి, చంచ‌ల్‌గూడ‌ జైళ్లల్లో గడిపారు.