మోడీ మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానం: గౌర‌వ్‌ గ‌గోయ్

Gaurav Gogoi to initiates debate in Lok Sabha, says ‘PM took a maun vrat on Manipur’

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం పై లోక్‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. మూడు రోజుల పాటు చ‌ర్చ కొన‌సాగ‌నున్న‌ది. మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ మౌనం వ‌హించార‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చ‌ర్చ మొద‌లుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత గౌర‌వ్ గ‌గోయ్ ఆ చ‌ర్చ‌ను ప్రారంభించారు. నిజానికి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చ‌ర్చ‌ను ఆరంభిస్తార‌ని ఆశించినా.. ఆయ‌న ముందుగా ఆ అంశంపై మాట్లాడ‌లేదు.

గౌర‌వ్ గ‌గోయ్ మాట్లాడుతూ.. బ‌ల‌వంతంగా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని, ఇది సంఖ్యా బ‌లానికి చెందిన విష‌యం కాదు అని, మ‌ణిపూర్‌కు న్యాయం చేయాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. ప్ర‌భుత్వంపై అవిశ్వాసాన్ని వ్య‌క్తం చేయ‌డం కోస‌మే తాము తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపారు. మ‌ణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామ‌ని, మ‌ణిపూర్‌కు న్యాయం జ‌ర‌గాల‌న్నారు.

పార్ల‌మెంట్‌లో మాట్లాడ‌రాదు అని ప్ర‌ధాని మోడీ మౌన‌వ్ర‌తం చేప‌ట్టార‌ని, ఆయ‌న మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానాన్ని తీసుకువ‌చ్చామ‌న్నారు. ఆయ‌న్ను మూడు ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని ఉంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎందుకు మ‌ణిపూర్‌ను విజిట్ చేయ‌లేద‌ని, 80 రోజుల తర్వాత ఆ అంశంపై కేవ‌లం 30 సెక‌న్లు మాట్లాడార‌ని, ఎందుకు ఆయ‌న ఇంత స‌మ‌యాన్ని తీసుకున్నార‌ని, మ‌ణిపూర్ సీఎంను ఎందుకు ఇంత వ‌ర‌కు తొల‌గించ‌లేద‌ని గౌర‌వ్ గ‌గోయ్ ప్ర‌శ్నించారు.

ఈ అంశంపై మాట్లాడేందుకు భార‌త రాష్ట్ర స‌మితికి 12 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించారు. బిజెపికి 6 గంట‌ల 41 నిమిషాలు కేటాయించారు. చ‌ర్చకు మొత్తం 16 గంటల స‌మ‌యం కేటాయించారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి గంటా 9 నిమిషాలు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది.