బిజెపి సభ లో గద్దర్..

శనివారం తుక్కుగూడ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో గద్దర్ ప్రత్యక్షమయ్యారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న గద్దర్.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఇక ఇప్పుడు బిజెపి సభ కు హాజరవ్వడం, దాదాపు గంటపాటు సభలోనే ఉండడం రాజకీయంగా చర్చ కు దారితీసింది.

సభ పూర్తికాగానే ఎయిర్‌పోర్టులో అమిత్ షాను కలిసిన గద్దర్ ఆయనకు వినతిపత్రం అందించారు. ఆ సమయంలో ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ ‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. వయసు రీత్యా తనపై ఉన్న కేసులతో గద్దర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేసుల ఉపసంహరణ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనపై కేసులు ఎత్తేయాలని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేశారు. గతంలో ఓ సందర్భంలో కిషన్ రెడ్డిని కలిసి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా కోరారు. ఇదే క్రమంలో తాజాగా బీజేపీ నేతల చొరవతో అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది.