ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మరణవార్త యావత్ క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇటీవలె దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మరణ వార్త నుండి ఇంకా బయట పడకముందే ఇప్పుడు సైమండ్స్‌ ఇకలేరు అనేది తట్టుకోలేకపోతున్నారు. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

సైమండ్స్‌ కెరియర్ విషయానికి వస్తే.. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే జట్టులో కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్‌.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్‌.. 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసుకున్నాడు.

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్‌.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. సైమండ్స్‌ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.