మోడీ సభకు వెళ్లిన ప్రజా గాయకుడు గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న విజయ సంకల్ప సభ కు వెళ్లారు. చాలా కాలం వామపక్షాల తరఫున నిలిచిన గద్దర్.. వాటికి విరుద్ధంగా ఉండే బీజేపీ సభా ప్రాంగణానికి రావడం గమనార్హం. తాను ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికే సభకు వచ్చానని.. ఆయన ఏం సందేశం ఇస్తారన్నది విన్నాక తాను మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా రాజకీయ నేతలను కలుస్తున్న గద్దర్.. గతంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభకూ హాజరయ్యారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నేతలు.. ప్రత్యేక బస్సుల్లో పరేడ్ గ్రౌండ్స్ సభా ప్రాంగణానికి వెళ్లారు.

ఇక రెండ్రోజులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తోంది. పార్టీ ఉన్నతస్థాయి సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని ‘భాగ్యనగర్’ అని సంబోధించారు. నాడు భారతదేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘భాగ్యనగర్’ నుంచే ప్రస్థానం ఆరంభించారని వెల్లడించారు. ఏకీకృత భారతావనికి పటేల్ ‘భాగ్యనగర్’ లోనే పునాదిరాయి వేశారని కీర్తించారు. ఇది మనందరికీ చారిత్రక ఘట్టం అని మోదీ అభివర్ణించారు.