ర‌ష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వుః జీ7 హెచ్చరిక!

G7 warns of ‘severe consequences’ if Russia uses nuclear weapons

మాస్కోః ఉక్రెయిన్ పై ర‌ష్యా క్షిప‌ణుల వ‌ర్షం కురిపించ‌డం ప‌ట్ల జీ7 దేశాలు మండిప‌డ్డాయి. ఉక్రెయిన్‌పై ర‌ష్యా ద‌మ‌న‌కాండ‌కు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ జీ7 దేశాధినేత‌లు వ‌ర్చువ‌ల్ భేటీలో ర‌ష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ర‌ష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని జీ7 హెచ్చ‌రించింది. ర‌ష్యా మిసైల్ దాడుల‌ను ఖండించిన జీ7 ఉక్రెయిన్‌కు త‌క్ష‌ణ సైనిక‌, ర‌క్ష‌ణ అవ‌స‌రాలు, సామాగ్రిని చేర‌వేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఉక్రెయిన్ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు తాము క‌ట్టుబ‌డిఉన్నామని సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో జీ7 స్పష్టం చేసింది. ర‌ష్యాను నిలువ‌రించేందుకు ఉక్రెయిన్‌కు గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ సామ‌ర్ధ్యాల‌ను క‌ల్పించాల‌ని జీ7 దేశాల‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ అభ్య‌ర్ధించారు. మాస్కోపై క‌ఠిన తాజా ఆంక్ష‌లు విధించాల‌ని జీ7 స‌మావేశంలో జెలెన్‌స్కీ కోరారు.

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తి లేద‌ని తోసిపుచ్చారు. ఇక ర‌ష్యా ఎలాంటి ర‌సాయ‌న‌, జీవ‌, అణ్వాయుధ‌రాల‌ను వాడినా తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని ర‌ష్యాను హెచ్చ‌రిస్తున్నామ‌ని జీ7 ప్ర‌క‌ట‌న పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆర్ధిక‌, సైనిక‌, దౌత్య‌, న్యాయ సాయం అవ‌స‌ర‌మైనా అందించేందుకు ఆ దేశానికి బాస‌ట‌గా నిలిచేందుకు సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/