ప్రధాని మోడీ తో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో వైరల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..ప్రధాని మోడీ తో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నేడు ప్రధాని వరంగల్ లో పర్యటించారు. రూ. 6,100 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీ..ఏంఐ ప్రత్యేక విమానం‌లో వరంగల్‌ మామునూరుకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భద్రకాళి అమ్మవారి దేవాలయం కు చేరుకున్నారు. ఆలయ అర్చకులు మోడీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు వెళ్లారు.

కాగా మోడీకి తెలంగాణ మంత్రులు ఎవరు కూడా స్వాగతం పలకలేదు. ఉదయం వరకు కూడా సీఎం కేసీఆర్ ఎలాగూ రాడు కాబట్టి మంత్రి తలసాని స్వాగతం పలుకుతారని భావించారు. కానీ ఈసారి తలసాని కూడా దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో కిరణ్ కుమార్ రెడ్డి కనిపించారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికారు ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బిజెపి హైకమాండ్ ఆయనకు తగిన బాధ్యతలను అప్పగించింది. బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. కిరణ్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియామకం అయినా తర్వాత మొదటి సారి ప్రధాని మోడీని కిరణ్ కుమార్ కలవడం జరిగింది.