ప్రధాని మోడీని కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్

కెనడాతో నెలకొన్న దౌత్య విభేదాలపై వివరణ

Foreign Minister S Jaishankar Meets PM Modi Amid Diplomatic Row With Canada

న్యూఢిల్లీ: కెనడాతో దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో ప్రధాని మోడీని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈరోజు కలిశారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో వారిద్దరూ సమావేశమయ్యారు. కెనడాతో నెలకొన్న దౌత్యపరమైన సమస్యలను ప్రధాని మోడీకి విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వివరించినట్లు తెలిసింది. జూన్‌లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ఆ దేశం ఆరోపించింది.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందన్న దానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంఘటనపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంపైనా మంగళవారం ఆయన స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టడం లేదన్నారు. అయితే నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాలు తమ తమ దౌత్య అధికారులను బహిష్కరించాయి. అలాగే కెనడా ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఇవి కల్పితం, విడ్డూరమని విమర్శించింది. ఈ నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాలపై చర్చించేందుకు విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రధాని మోడీని కొత్త పార్లమెంట్ హౌస్‌లో బుధవారం కలిశారు.