ఆర్కే బీచ్‌లో విషాదం..న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు

విశాఖ బీచ్ లో న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకున్న వారు చివరికి అందులోనే గల్లంతై మృతి చెందారు. సికింద్రాబాద్ కు చెందిన 8మంది యువకులు ఆదివారం మధ్యాహ్నం ఆర్కే బీచ్ చేరుకున్నారు. నీళ్లల్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా పెద్ద కెరటాలు రావడంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. సముద్రంలో కొట్టుకుపోతున్న సీహెచ్‌ శివను లైఫ్‌ గార్డ్స్‌ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు.

హైదరాబాద్ బేగంపేటకు చెందిన శివ, అజీజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి డిసెంబర్ 30న హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. సెలబ్రేషన్స్ ముగించుకుని జనవరి 2 సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అలాగే ఒడిశా ప్రాంతానికి చెందిన ఐదుగురు విద్యార్థులు.. మధ్యాహ్నం ఆర్‌కే బీచ్‌కు చేరుకున్నారు. ఈ ఐదుగురు స్నానం చేయడానికి సముద్రంలో దిగారు. పెద్ద కెరటం నెట్టడంతో విద్యార్థిని సుమిత్రా త్రిపాఠి నీట మునిగింది. మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కాసేపటి తర్వాత సుమిత్రా త్రిపాఠి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.