తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల చురుకుదనంవల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. మంగళవారం నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణతోపాటు పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో జూన్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/