వెలగపూడిలోని అన్న క్యాంటీన్ ధ్వంసం

వెలగపూడిలోని అన్న క్యాంటీన్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసంచేసారు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే మార్గంలో కుడివైపున ఈ క్యాంటీన్ ఉంటుంది. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత వైస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. దీంతో సచివాలయం పక్కనున్న అన్న క్యాంటీన్ ప్రాంతం పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
ఈ క్రమంలో ఈ క్యాంటీన్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. క్యాంటీన్ పైకప్పు తొలగించి, గోడలు పగులగొట్టారు. ఇటుకలను తొలగించారు. 2016లో సచివాలయ ఉద్యోగులు, రాజధాని నిర్మాణ పనులకు వచ్చే కూలీలకు అందుబాటులో ఉండేలా సీఆర్డీఏ అధికారులు మల్కాపురం వద్ద అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఎంతో మంది పేదలకు, ఉద్యోగులకు, కూలీలకు కడుపు నింపిన ఈ అన్నా క్యాంటీన్ ను ఇప్పుడు ధ్వసం చేసారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటె తాజాగా అన్న క్యాంటీన్ పేరిట గుంటూరులో ఓ క్యాంటీన్ శనివారం ప్రారంభమైంది. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌లు ఈ క్యాంటీన్‌ను గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో ప్రారంభించారు. టీడీపీ ఎన్నారై విభాగం, నందమూరి బాలకృష్ణ అభిమానులు అందించిన ఆర్థిక సాయంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. గతంలో అన్న క్యాంటీన్‌లో మాదిరే ఈ క్యాంటీన్‌లోనూ రూ.5లకే భోజనాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.