జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

కౌంటర్ దాఖలుకు సమయం కోరిన రాష్ట్ర సర్కారు

అమరావతి : విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరిస్తుండడాన్ని ఏపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. స్టీల్ ప్లాంట్ కు భూములిచ్చిన వారి వివరాలను రాష్ట్ర సర్కారు అఫిడవిట్ లో పొందుపరచలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా, తమకు సమయం కావాలంటూ ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ క్రమంలో, తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

కాగా ఈ కేసులో గత వారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని, దేశ ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉంటుందని ఆ అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఈ అంశంలో పిల్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో పోటీ చేశారని, విశాఖలో రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ దాఖలు చేశారని కేంద్రం ఆరోపించింది. ఇలాంటి పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/