నాచారంలో మరో అగ్ని ప్రమాదం

విషవాయువులు వెలువడి పలువురు కార్మికులకు అస్వస్థత

fire-at-ekasila-chemical-company-in-nacharam-ps-area

హైదరాబాద్: హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గత కొద్దీ రోజులుగా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉండడం తో నగరవాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. మొన్నటికి మొన్న కుషాయిగూడ సాయినగర్ కాలనీలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి..టింబర్ డిపోకు ఆనుకొని ఉన్న భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో అందులో నివాసముంటున్న ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనలో దంపతులు సహా వారి చిన్న కుమారుడు చనిపోయాడు. ఈ ఘటన ఇంకా మరచిపోకముందే మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో ఏకశిలా రసాయన కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసారు. అగ్నిప్రమాదంతో విషవాయువులు వెలువడి పలువురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అస్వస్థతకు గురైన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంతో అమోనియో విష వాయువు పీల్చుకుని పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.