సూర్యాపేట లో అగ్నికి ఆహుతైన TSRTC బస్

సూర్యాపేట జిల్లాలో టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజధాని బస్సులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడం తో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపేసి ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దింపేసాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సు సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డుకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సు నుంచి కిందకు దిగి దూరంగా పరుగులు తీశారు. వారు చూస్తుండగానే క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అందరూ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.