డబ్బు కోసం కసాయి తండ్రి ఏం చేశాడంటే?

కన్నకొడుకును డబ్బుపిచ్చితో ఓ కన్నతండ్రి వేలానికి పెట్టిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో అందరూ ఆ కసాయి తండ్రి చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్నారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే దంపతులకు నెల రోజుల క్రితం ఓ మగబిడ్డ జన్మించాడు. బాబు పుట్టాడనే ఆనందాన్ని ఆ తల్లికి లేకుండా చేశాడు ఆమె భర్త.

కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో బేరం కుదుర్చుకున్న సదరు తండ్రి, నెలరోజుల పసివాడిని రూ.70 వేలకు విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి లబోదిబోమంటూ గుండెలు బాదుకుంది. తన బిడ్డను తనకు తెచ్చివ్వాలంటూ ఆమె అతడిని నిలదీసింది. అయినా కూడా అతగాడు చేసిన పనికి ఏమాత్రం సిగ్గులేకుండా వ్యవహరించడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నెలరోజుల పసివాడిని డబ్బుల కోసం అమ్మేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు ఆ కసాయి తండ్రిపై కేసు నమోదే చేసి విచారిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా అతడు కొడుకును అమ్మిన వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అమానవీయ ఘటనతో కసాయి తండ్రి అంటే ఇలా ఉంటాడని అందరూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.