అవినాష్‌కు ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఏడాదిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలవడంతో ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

గతంలో వచ్చిన ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని అంతకంటే రెట్టింపు ఉత్సాహంగా తీర్చిదిద్దేందుకు అనిల్ రావిపూడి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్లలో మార్పులు లేకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పలు మార్పులు చేస్తున్నాడు. కాగా ఇందులో ఓ కీలక పాత్రను పోషించేందుకు జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్‌ను తీసుకునేందుకు రెడీ అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవల బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేసిన అనిల్ రావిపూడి, తన నెక్ట్స్ చిత్రంలో ఖచ్చితంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు అవకాశం కల్పిస్తానని చెప్పాడు.

దీంతో ఇప్పుడు ఓ కామెడీ పాత్రలో నటించేందుకు ముక్కు అవినాష్‌ను సెలెక్ట్ చేశాడట ఈ డైరెక్టర్. ముందే ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న ఎఫ్3లో అవినాష్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఏదేమైనా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు వరుసబెట్టి సినిమా ఛాన్సులు వస్తుండటంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.