ప్రాణం తీసిన కోతి.. ఎక్కడంటే?

కోతులు చేసే పనులు చాలా చిరాకు తెప్పిస్తుంటాయి. వాటి అల్లరిని పక్కనబెడితే ఒక్కోసారి కోతులు చేసే పనులు ఇతరుల ప్రాణాలపైకి తెస్తుందనే విషయం తాజాగా జరిగిన ఘటనతో రుజువయ్యింది. ఇంట్లోకి వచ్చిన కోతులను తరిమే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లిలో నివాసముంటున్న లోకేష్ వృత్తిరిత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా ఇంట్లో నుండి పనిచేస్తున్న లోకేష్, మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లోకి కోతులు వచ్చినట్లు గమనించాడు. దీంతో వాటిని తరిమేందుకు ఓ ఇనుప రాడ్‌ను తీసుకుని వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా అతడు పట్టుకున్న ఇనుప రాడ్ కరెంట్ తీగలకు తగిలింది. దీంతో అతడికి కరెంట్ షాక్ తగిలి అక్కడే కుప్పకూలి పడిపోయాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లోకేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కోతులు చేసిన పనికి ఓ మనిషి నిండు ప్రాణం బలవ్వడంతో స్థానికంగా అందరూ కోతులంటేనే భయపడుతున్నారు.