మెహబూబా ముఫ్తీని కలిసి ఫారూఖ్ అబ్దుల్లా
మంగళవారం రాత్రి నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తి

శ్రీనగర్: గత ఏడాది గృహ నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం రాత్రి విడుదలైంది. సుమారు 14 నెలలపాటు గృహ నిర్బంధంలో ఉండి విడుదలైన ముఫ్తీని ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. బుధవారం ఉదయం ముఫ్తీ నివాసానికి వెళ్లిన వీరిద్దరు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఐదేళ్ల క్రితం ఉప్పునిప్పుగా ఉన్న వీరు ఇప్పుడు ఒకే చోటకు చేరడం పట్ల రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతోపాటు ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచింది. ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద ఫరూక్, ఒమర్‌ను సుమారు ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉంచిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలల కిందట వారిని విడుదల చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/