భోపాల్ లో మద్యం షాపును ధ్వంసం చేసిన ఉమాభారతి

ex-union-minister-uma-bharti-vandalises-liquor-shop

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి గత కొంత కాలంగా మద్యాన్ని నిషేధించాలంటూ డిమాండు చేస్తున్నారు . అయితే ఆమె తాజాగా భోపాల్ లోని ఓ మద్యంషాపుపై అనుచరులతో కలిసి దాడిచేశారు. మద్యం సీసాలపైకి రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాలంటూ శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి ఉమాభారతి గతంలో డెడ్‌లైన్ విధించారు. అది ముగిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం, దీనికి తోడు మద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ఉమా భారతి ఆగ్రహానికి కారణమైంది.

రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలంటూ గతంలో డిమాండ్ చేసిన ఉమాభారతి అందుకు జనవరి 15 వరకు గడువు విధించారు. అప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఆమె డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా.. విదేశీ మద్యంపై 10 నుంచి 13 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో మద్యం మరింత అందుబాటులోకి వచ్చింది. దేశీయ, విదేశీ లిక్కర్‌ను విక్రయించేందుకు దుకాణాలకు అనుమతినిచ్చింది. ద్రాక్షతోపాటు బ్లాక్‌ప్లమ్స్ నుంచి మద్యం తయారీకి ఉత్పత్తిదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఇంట్లో లిక్కర్‌ను నిల్వచేసుకునేందుకు కూడా అనుమతినిచ్చింది.

దీనికి తోడు వార్షిక ఆదాయం కోటి రూపాయలకు మించి ఉంటే ఇంటి వద్దే బార్ ప్రారంభించుకోవచ్చని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాను మద్యాన్ని నిషేధించమని డిమాండ్ చేస్తే ప్రభుత్వం మరింత చౌకగా, మరింత మందికి మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యంషాపులపై దాడికి దిగారు. కాగా, సొంత ప్రభుత్వంపైనే ఉమ ఇలా విరుచుకుపడుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/