ఐసియులో ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌..పరామర్శించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అనారోగ్యంతో ఐసియు లో చికిత్స తీసుకుంటుండడంతో ఆయన్ను పరామర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం కేసీఆర్ గత మూడు రోజులుగా తమిళనాడు లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువుర్ని కలిసిన కేసీఆర్…మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అనారోగ్యంతో కావేరి ఆస్పత్రిలో ఐసియులో చికిత్స తీసుకుంటున్నాడనే విషయం తెలిసి…ఆయన్ను పరామర్శించారు.

ఐసియులో నరసింహన్‌కు చికిత్సనందిస్తున్నందున వైద్యులు సీఎం కేసీఆర్ ను దూరం నుంచి చూడడనికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ దూరం నుంచే ఆయన్ని చూసి నరసింహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

1968 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. 2007లో ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009లో అప్పటి ఏపీ గవర్నర్ ఎన్డీ తివారీ రాజీనామాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం 2010లో ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ సమయంలో ఈఎస్‌ఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు.

రాష్ట్ర విభజనానంతరం కూడా ఈఎస్ఎల్ నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయన ఐదుగురు ముఖ్యమంత్రులతో కలసి పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు కె.రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పనిచేశారు. ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యాక ఆయన తెలంగాణకు గవర్నర్‌గా ఉన్నారు. ఉమ్మడి ఏపీకి నరసింహన్ సుదీర్ఘ కాలం గవర్నర్‌గా పనిచేశారు.