ఆసియా గేమ్స్​లో అదరగొడుతున్న భారత్ షూటర్లు

ఆసియా గేమ్స్​లో భారత్ షూటర్లు అదరగొడుతున్నారు. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో హైదరాబాద్ కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన చేసింది. బుధవారం ఓ స్వర్ణం, రతజం సాధించిన ఆమె ఈ రోజు మరో రెండు రజతాలు సొంతం చేసుకుంది. దాంతో, ఆసియా క్రీడల షూటింగ్ చరిత్రలో నాలుగు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా షూటర్ గా రికార్డు నెలకొల్పింది.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా మెన్ జట్టు 1734 పాయింట్ల అగ్రస్థానంతో చైనాను ఓడించి పసిడిని అందుకుంది. సరబ్‌జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ చీమా 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లతో ప్రతిభను చాటుకున్నారు. ఆసియా క్రీడల్లో భారత్ కు ఇది నాలుగో స్వర్ణం. మరోవైపు సరబ్, అర్జున్ 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు చేరినప్పటికీ పతకాలు మాత్రం గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు సాధించారు.