టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎర్రబెల్లి సోదరుడు

తెలంగాణ అధికారపార్టీ టిఆర్ఎస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌ కు పార్టీ కి రాజీనామా చేసారు. పార్టీలో సరైన గుర్తింపు లేనందునరాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలివ్వడంతో ఆ పార్టీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలుచేశారు. అయినా ప్రదీప్ రావు మాత్రం టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు వచ్చే సరికి టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరని అభిప్రాయపడ్డారు.

పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు పడ్డాను. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మా కార్యకర్తలకు టీఆర్ఎస్ ఏమీ చేయలేదు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశా అని ప్రదీప్ రావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే(నరేందర్) అవమానపరిచేలా మాట్లాడారని, సదరు ఎమ్మెల్యే తిట్టినా టీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా ఖండించలేదన్నారు. కనీస గుర్తింపు లేనప్పుడు ఈ పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు.

రాజీనామా ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రదీప్ రావు.. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చినా వారికి కనీస సాయం చేయలేకపోతున్నానని వాపోయారు. టీఆర్ఎస్ లో 9ఏండ్ల పాటు క్రమశిక్షణతో ఉండి నిస్వార్థంగా పనిచేశానని, పదవులు ఇవ్వకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని చెప్పారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో కొనసాగడం ఎందుకన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రదీప్ రావు ప్రకటించారు. సంస్కారంలేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ప్రదీప్ రావు అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తానని, లేదంటే స్వతంత్రంగా ఉంటానని ప్రదీప్ రావు తెలిపారు. కాగా, ప్రదీప్ రావు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.