19 లక్షల రేషన్‌ కార్డుల రద్దు చేశారంటూ..మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్​ లేఖ

కేసీఆర్ ప్రభుత్వం 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మానవ హక్కుల సంఘానికి లేఖ రాసారు. కొత్త రేషన్ కార్డులను అందిస్తామంటూనే పాత రేషన్ కార్డుల్లో కోత విధిస్తోందంటూ మండిపడ్డారు. కేసీఆర్ అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆరోపించారు. వీటిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 19 లక్షల రేషన్‌ కార్డులను రద్దు చేసిందని సంజయ్ పేర్కొన్నారు. అలాగే కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జూన్‌ 2021 నుంచి కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులను మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదన్నారు. ఇలా రేషన్ కార్డులు లేక నిరుపేదలు ఆకలి బాధతో అలమటించే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలివ్వాలని హెచ్ఆర్‌సీని బండి సంజయ్ కోరారు