ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్‌..!

‘పక్షికి విముక్తి లభించింది’ అంటూ మస్క్ ట్వీట్

elon-musk-takes-over-twitter-says-the-bird-is-freed

శాన్ ఫ్రాన్సిస్కో: ట్విట్టర్ ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హస్తగతం విషయం తెలిసిందే. ప్రపంచంలో అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విటర్‌ను నియంత్రణలోకి తీసుకొని, దాని టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. ఆ తర్వాత ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. “పక్షికి విముక్తి లభించింది” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ట్విట్టర్ లోగోలో నీలి రంగు పక్షి ఉండటం గమనార్హం. ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి చేసిన మస్క్ గురువారం దానికి కొత్త యజమాని అయ్యారు.

అయితే తనను తప్పుదారి పట్టించారని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోసం తాను వివరించిన ఉన్నతమైన ఆశయాలను ఎలా సాధించాలనే దానిపై సరైన స్పష్టత లేదంటూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్‌ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ వేటు వేశారు. కీలక వ్యక్తుల తొలగింపు విషయంలో మస్క్ చేసిన ఆరోపణలపై ట్విట్టర్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, 44 బిలియన్ డాలర్లకు మస్క్ ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి చేశారు.