ఆ ఖాతాలకు క్షమాభిక్ష..ఎలాన్‌ మస్‌ మరో నిర్ణయం

Elon Musk says Twitter to provide amnesty to suspended accounts starting next week

శాన్ ఫ్రాన్సిస్కోః ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మస్క్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం నుంచే ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.

విధ్వేషపూరిత పోస్టులు, నకిలీ సమాచార వ్యాప్తి తదితర కారణాలతో గతంలో పలువురి ఖాతాలను ట్విట్టర్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ స్టార్‌ నటి కంగనా రనౌత్‌ సహా పలువురు ప్రముఖుల ఉన్నారు. ఇటీవల మస్క్‌ పోలింగ్‌ నిర్వహించి ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించారు. తాజాగా ‘గతంలో నిలిపివేసిన ఖాతాలకు క్షమాభిక్ష పెట్టాలా..? వద్దా..?’ అన్న దానిపై మస్క్‌ గురువారం మరోసారి పోలింగ్‌ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో 31.6 లక్షల (3.16 మిలియన్స్‌) మంది పాల్గొన్నారు. అందులో 72శాతం మంది ‘క్షమాభిక్ష పెట్టాలి’ అని ఓటు వేశారు. దీంతో ఆ ఖాతాలను పునరుద్ధరించాలని మస్క్‌ నిర్ణయించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/