ఎన్నిక‌ల బాండ్ల..సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన రాహుల్‌ గాంధీ

rahul-gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత‌, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నిక‌ల బాండ్ల జారీని నిలిపివేయాల‌ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన అంశంపై స్పందించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ల‌క్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌ధ‌కం లంచాలు, క‌మిష‌న్ల‌కు మాధ్య‌మంగా ఉప‌యోగ‌ప‌డింద‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. న‌రేంద్ర మోడీ మ‌రో అవినీతి విధానాలకు ఇప్పుడు మ‌రో నిద‌ర్శ‌నం ప్ర‌జ‌ల ముందు బ‌ట్ట‌బ‌య‌లైంది. లంచాలు, క‌మిష‌న్లు తీసుకునేందుకు సాధ‌నంగా మోదీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల బాండ్లను తీసుకువ‌చ్చింద‌ని రాహుల్ ఆరోపించారు.

స‌ర్వోన‌త్న న్యాయ‌స్ధానం ఉత్త‌ర్వుల‌తో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని అన్నారు. కాగా, ఎల‌క్టోర‌ల్ బాండ్ల పై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఆ తీర్పును ఇచ్చింది. కేంద్ర స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై కోర్టు తీర్పును వెలువ‌రించింది. బ్లాక్ మ‌నీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు అని కోర్టు పేర్కొన్న‌ది.

జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, బీఆర్ గ‌వాయి, జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాలు ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు.ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని సీజేఐ చంద్ర‌చూడ్ తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చ‌ట్టంలో 29(1)సెక్ష‌న్ స‌వ‌ర‌ణ రాజ్యాంగ వ్య‌తిరేకం అవుతుంద‌న్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేసే బ్యాంకులు త‌క్ష‌ణ‌మే బాండ్ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజ‌కీయ పార్టీలు వివ‌రాల‌ను ఎస్‌బీఐ బ్యాంకు వెల్ల‌డించాల‌ని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నిక‌ల సంఘానికి ఆ వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్ర‌తి బాండ్‌కు చెందిన వివ‌రాల‌ను ఎస్బీఐ వెల్ల‌డించాలి.