అధిష్టానం ఫై బిఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌ రెడ్డి ఆగ్రహం..

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై సొంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సోమవారం పార్టీ అధినేత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 మందికి గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. మరో నలుగుర్ని హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల తో పాటు టికెట్ దక్కుతుందో అని ఎదురుచూసిన వారు సైతం అధిష్టానం ఫై ఆగ్రహం తో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నుండి బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. అంబర్ పేట బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్​చార్జి ఎడ్ల సుధాకర్‌ రెడ్డి పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు.

సోమవారం తన క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు న్యాయం చేయని ఎమ్మెల్యేను మరోసారి ఎన్నుకునేందుకు సుముఖత చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్రం సాధించకున్నాక 2014లో తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 2018లో తన మిత్రుడు కాలేరు వెంకటేశ్​కు అధిష్టానం టికెట్ ఇవ్వగా పార్టీ నేతలందరం కలిసి కట్టుగా గెలిపించుకున్నామని పేర్కొన్నారు. 2023లో తాను పోటీ చేస్తానని అధిష్టానానికి విన్నవించగా సానుకూలంగా స్పందించి.. మళ్లీ సిట్టింగ్​కే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పేటలో గూండాయిజం, దోపిడీ, కబ్జాలకు పాల్పడటం తప్ప.. కాలేరు వెంకటేశ్​ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదని ఆరోపించారు.