చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు..విచారణకు హాజరుకావాల్సిందే

విదేశాల్లో క్యాసినోల పేరిట ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదురుకుంటున్న చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈడీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ దాడులు నిర్వహించింది. మొత్తం 8 ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. గురువారం (జూలై 28) తెల్లవారుజాము వరకు ఏకధాటిగా 20 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు సమకూర్చి.. తాను బ్లాక్ మార్కెట్ ద్వారా బంగారం తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది. క్యాసినోకు రావాలంటూ పలువురు హీరోయిన్లు చేసిన ప్రమోషన్‌ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన పేమెంట్‌.. ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఇక ప్రవీణ్ కు నేరచరిత్ర ఉంది. గతంలో ఒక సినీప్రముఖుణ్ని కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణ అతడిపై ఉంది. ఇరవై ఏళ్ల క్రితం చిన్న సిరామిక్‌టైల్స్‌ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్‌.. తర్వాత నిర్మాతగా మారి సినిమా తీసి, విలన్‌గా నటించి దివాలా తీశాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి దాన్నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత.. గోవాలో ఓ పేకాట క్లబ్బులో కొన్ని టేబుళ్లలననుఉ లీజుకు తీసుకుని జూద నిర్వహణలో ప్రస్థానం ప్రారంభించాడు. ఆతర్వాత అంచెలంచెలుగా తన క్యాసినా సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తాడు. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.

2017లో దీపావళి నాడు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో పేకాట ఆడిస్తూ పోలీసులకు చిక్కాడు. అప్పుడు దాదాపు 30 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రవీణ్‌.. గోవాలో క్యాసినో నిర్వహించేవాడు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించింది ప్రవీణే. అంతేకాదు.. బిగ్‌డాడీ పేరుతో గోవాతో పాటు నేపాల్‌, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్‌, తదితర దేశాల్లో క్యాసినోను నిర్వహిస్తుంటాడు. గత నెలలో తన పుట్టినరోజు వేడుకలను చంపాపేటలోని ఒక గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, ప్రకాశ్‌గౌడ్‌, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారులు, పోలీసు అధికారులు హాజరవడం గమనార్హం.