దేశ వ్యాప్తంగా అంబేద్క‌ర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా అంబేద్క‌ర్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లు అర్పించారు. భార‌త‌రత్న‌, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ అంద‌రివాడు, ఆ మ‌హానీయుడిని ఒక కులానికి అంట‌గ‌ట్ట‌డం స‌రికాద‌ని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లక్నోలోని BSP ఆఫీసులోని అంబేద్కర్ విగ్రహానికి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పూలమాల వేసి అంజలి ఘటించారు.

అంబేడ్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్‌, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్‌ పాల్గొన్నారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం నివాళి అర్పించారు. బాబా సాహెబ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అంబేద్క‌ర్ చిత్ర ప‌టం ముందు ఆయ‌న‌కు కేటీఆర్ నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించారు.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాట‌య్యేందుకు అంబేద్క‌ర్ బాట వేశార‌ని, ఆయన రాసిన భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్ర‌కార‌మే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింద‌ని తెలిపారు. అంతేకాకుండా జీవితం సుదీర్ఘంగా ఉండేదానికంటే గొప్ప‌గా ఉండ‌ట‌మే మేలంటూ అంబేద్క‌ర్ చెప్పిన మాట‌ను కూడా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. భవిష్యత్ తరాల కోసం, బడుగు జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పని చెయ్యాలన్నారు. వ్యవస్థలపై దాడులు జరుగుతుంటే మళ్లీ వాటిని రక్షించేది కూడా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమేననని చంద్రబాబు తెలిపారు.