పిల్లలపై ఒత్తిడి వద్దు

పిల్లలు మంచి ప్రవర్తన కలిగి దృఢంగా తయారవ్వాలని అన్నింటిలో విజయం సాధించాలని ప్రతి తల్లిత్డంరి కోరుకుంటారు. ఈ క్రమంలో చిన్నారులపై ఎక్కువ భారాన్ని మోపి వారిపై ఒత్తిడిని పెంచుతారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు కొన్ని హద్దులు పెట్టడం తప్పనిసరి. టివి చూసే విషయంలో కూడా. ప్రతి చిన్న విషయానికి నియమ, నిబంధనలు పెట్టవద్దు. ఈ మాత్రమే వేసుకో. అదే తినాలి వంటి విషయాల్లో ఖచ్చితంగా ఉండాలని లేదు. ఇలాంటి విషయాల్లో వారి ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు ఏ పని చేస్తున్నా హెచ్చరిస్తున్నట్లయితే వాళ్లపై వాళ్లకు ఏ మాత్రం విశ్వాసం ఉండదు. మీరు క్రమశిక్షణను భయంకరంగా అమలుపరుస్తున్నారని తెలుస్తుంది. దాంతో మీ చిన్నారులు భయంతో వణికిపోతారు. అయితే కొద్దికాలంలో ఈ భయం కాస్త క్రూరంగా మారిపోతుంది. వారి ప్రవర్తలో తీవ్రమైన మార్పులు రావచ్చు. దాంతో వారు అనుచితంగా ప్రవర్తించవచ్చు. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మిగతా పిల్లలతో పోలుస్తూ చదువు, ఆటల్లో ముందుండాలని ఒత్తిడికి గురి చేస్తారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. వారు బాగా చదివేలా ఆడేలా ప్రోత్సహించాలి. ఆ క్రమంలో ఫలితాలపై దృష్టి పెట్టకుండా చేసే పనిలో వారు ఆనందం పొందేలా చూడాలి. అతిగా దూషించే ప్రయత్నము తప్పే. వారు చేసిన మంచి పనులను తప్పకుండా మెచ్చుకోండి. దీనివల్ల వారు ఎంతో సంతోషిస్తారు. ఇది వారిలో ఆశావహ దృక్పథాన్ని పెంచుతుంది. తప్పు చేసినప్పుడు కూడా వారిని సరిదిద్దే ప్రయత్నం చేయండి అంతే తప్ప అదేపనిగా వారిని దూషించకండి. మీ చిన్నారులు బాధపడుతున్నా మీ దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నా, మీతో వారి విషయాలు పాలు పంచుకోకపోయినా, వీటన్నింటికీ ఒకే కారణం. ఈ విషయాలన్నీ మీకు చెబితే మీరు తిడతారని, కోప్పడతారని లేదా నిరాశ నిస్పృహలకు లోనవుతారని మీతో చెప్పరు ఆ సమయంలో మీరు కట్టుబాట్లను కాస్త సడలించి వారికి కాస్త స్వేచ్ఛనిస్తే హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/