కరోనా టైములో ఎగ్జామ్స్ వద్దు
కరోనా మహమ్మారితో విద్యాసంవత్సరం అస్తవ్యస్థం

కరోనా మహమ్మారి వలన విద్యాసంవత్సరం అస్తవ్యస్థంగా తయారయింది.
సకాలంలో పూర్తి చేయ వలసి ఉన్న పరీక్షలు సైతం వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో నీట్, జెఇఇ పరీక్షలు వాయిదా కుదరదని, ఆ పరీక్షలు సెప్టెంబర్ మాసంలో నిర్వహించవలసి నదేనని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
తీర్పు అయితే ఇచ్చింది కానీ ప్రస్తుత పూర్వాపరాలు పరిశీలించినట్లయితే కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి.
ఇది ఇలా ఉండగా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు కూడా సెప్టెంబర్ చివరికి పూర్తి చేయాలని యూనివర్శిటీ గ్రాంట్‌కమిషన్ స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు తీర్పు శిరసావహించాల్సి ఉన్నా పరీక్షల నిర్వహణ తీరే ఆందోళన కలిగిస్తోంది.
నీట్ పరీక్షకు దాదాపు 17 లక్షల మంది, జెఈఈకి 11 లక్షల మంది హాజరు కావలసి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిలో ఎంత మంది పరీక్షలు రాస్తారో తెలియని పరిస్థితి.
అదీగాక ఈ పరీక్షకు హాజరు అయ్యేవారు ఎక్కువ మంది యువతే కనుక పకడ్బందీ చర్యలు తీసుకోవలసి ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) వారు ఇటీవలే ఓ ప్రకటనలో 20 నుంచి 40,45 సంవత్సరాల వయసు వారి నుంచి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని హెచ్చరికలు చేసింది.
అయితే అన్ని చర్యలు తీసుకుని పరీక్షలు జరుపుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ) వైపు నుంచి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు పరీక్షల కేంద్రాల వద్ద గట్టి పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసి ఉంది.
పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు యధావిధిగా మాస్క్ ధరించి రావాలని, తెలియ చెప్పవలసిన అవశ్యకత ఉంది.
మాస్క్ మరచిన వారికి మాస్క్ ఇవ్వవలసిన బాధ్యత అధికారులపై కూడా ఉంటుంది. ఇంకా పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.
పరీక్షల గదులన్నీ శానిటైజ్ చేయాలి. ప్రశ్నపత్రాలు కూడా శానిటైజ్ చేసి ఇవ్వాలి. ఇంత తతంగం ఉంది.
అంతేకాక రవాణా సౌకర్యాలు ఎంత మాత్రం అందుబాటులో ఉంటాయో తెలియదు. అమ్మాయిలు ఒంటరిగా రావడానికి కుదరదు. వారితో ఎవరో ఒకరు రావాలి.
దూర ప్రాంతాల వారు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవలసిన తరుణంలో లాడ్జ్‌లు, హోటల్స్ అందుబాటులో ఉండవు.
ఉన్నా కొవిడ్ భయం వల్ల అక్కడకు పోవాలన్నా జంకు. బంధువుల, స్నేహి తులు ఇళ్లకు వెళ్లి ఆశ్రయం పొందాలన్నా వాళ్లు అనుమానించే పరిస్థితి దాపురించింది.
ఈ స్థితిలో అభ్యర్థులు పరీక్షలకు ఏ విధంగా రాగలరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
మనదేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసులు ఉధృతమవుతున్నాయి.
రోజూ 60వేలకుపైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పరీక్షల నిర్వహణ సజావ్ఞగా జరుగుతుందా! అనే భరోసా లేదు.
ఎలాగూ విద్యాసంవత్సరం ఆలస్యం అవుతోంది .
కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మేధావులతోనూ, విద్యావైద్య రంగ నిపుణులతో చర్చించి పూర్వాపరాలు తెలుసుకుని పరీక్షల నిర్వహణకు అనువైన నిర్ణయం తీసుకోవాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కరోనాతో పోటీపడి పరీక్షలు నిర్వ హిస్తే వచ్చే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారో సందేహాస్పదం.
కనుక నిజానిజాలు బేరీజు వేసుకుని ఒక సముచిత నిర్ణయం తీసుకుని పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది.
- కనుమ ఎల్లారెడ్డి
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/