కేటీఆర్ మెడలో పచ్చ కండువా..

తెలంగాణ తెరాస మంత్రి కేటీఆర్..గులాబీ కండువా కాకుండా పసుపు కండువా కప్పుకొని ఆశ్చర్య పరిచారు. బుధువారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌ను డీఎంకే పార్టీ ఎంపీలు కలిసి.. సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్‌కు అందించారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన తమిళనాడు ఎంపీలు ముందుగా మంత్రి కేటీఆర్‌ను పచ్చ కండువా(డీఎంకే కండువా)తో సత్కరించారు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు పసుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. అదే ఆ కిరణాలను ఆ పార్టీ రంగుగా భావిస్తుంటుంది. ఆ కండువాకు కూడా తమిళనాడువాసులు గౌరవం ఇస్తుంటారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని డీఎంకే ఎంపీలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ రద్దు కోరుతూ పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన విషయం విదితమే.
కేంద్ర ప్రవేశపెట్టిన నీట్ పరీక్షను అడ్డుకునేందుకు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారు. విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు తమిళనాడు సీఎం స్టాలిన్. అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ ఎంపీని పంపించారు.