టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత

టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అనారోగ్యంతో మృతి చెందుతుంటే..మరికొంతమంది రోడ్డు ప్రమాదంలో కన్నుమూస్తున్నారు. వారంలో ఎవరో ఒకరు ఇలా చనిపోతూనే ఉన్నారు. తాజాగా తెలుగు సినీ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు మరణించారు. ఫిట్స్ కారణంగా ఆయన మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.

నిన్న తన సొంత ఊరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయనను అక్కడ మరో రెండు, మూడు ఆసుపత్రులకు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఏలూరు ఆస్పత్రిలో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం కి ఎస్ రామారావు పార్థివదేహాన్ని ఆయన అత్తగారి ఊరైన నల్లజర్ల సమీపంలో ఉండే కౌలూరు లో ఉంచారు. అక్కడ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు నాగేశ్వరరావు.. ఆయన కోడిరామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కృష్ణంరాజు, జయసుధ జంటగా వచ్చిన ‘రిక్షా రుద్రయ్య’తో దర్శకుడిగా మారారు. ఇక దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది ఈయనే.. పోలీస్ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి లాంటి సినిమాలు చేశారు. కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.