చంద్రబాబు ఫై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్

ఏపీలో మరోసారి అమరావతి రాజధాని అంశం కాకరేపుతుంది. ఈరోజు అమరావతి లోని వెంకటపాలెం గ్రామంలో రైతుల పాదయాత్ర చేపట్టారు. దాదాపు ఏడాది కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు చేసిన మొదటివిడత పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే… అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కానీ ప్రభుత్వం… ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతోంది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా, అఫిడవిట్‌లతో కాలయాపన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘బిల్డ్‌ అమరావతి- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంతో అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో మహాపాదయాత్ర చేస్తున్నారు. నేడు అమరావతిలో మొదలై వెయ్యి కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర… నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యభగవానుడి చెంతకు చేరనుంది. ఈ పాదయాత్రకు బిజెపి , టీడీపీ , కాంగ్రెస్ , జనసేన మద్దతు తెలుపడం తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.

కాగా ఈ పాదయాత్రపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతి కూడా రాజధానే అని రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పడితే తప్పేంటని, ఉత్తరాంధ్ర వెనకబాటు తనం పోవాలంటే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఉండాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలనే విషయం కేవలం చంద్రబాబు ఎత్తుగడే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి క్యాపిటల్‌ వద్దంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఊరుకోవాలి..? మీరు యాత్ర చేస్తే మేము నోరు మూసుకొని కూర్చోవాలా..? గడిచిన ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే.. ఒక్క సంస్థ కూడా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పెట్టలేదు. మేము నోరుమూసుకొని ఊరుకోవాలా..? రైతులను రెచ్చగొట్టి మీదకు పంపిస్తున్నాడు. రైతులతో మాకు ఎలాంటి వివాదం లేదు. 29 గ్రామాల్లోని రైతులకు న్యాయం జరగాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటుంది. రైతుల ముసుగులో ప్రజలందరి రాజ్యాంగ హక్కులను హరించడం, గడిచిన కాలంలో జరిగిన మోసం మళ్లీ జరగడానికి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాసులకు అభివృద్ధి అక్కర్లేదని నోరు నొక్కడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాన్ని మేము అంగీకరించం” అంటూ ధర్మాన మండిపడ్డారు.